“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

భీష్మ ఏకాదశి- పరమ పవిత్రమైన రోజు


ఈ రోజు భీష్మ ఏకాదశి. మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. ఈ రోజునే విష్ణు సహస్ర నామం ఉద్భవించింది. విచిత్ర మైన ఘట్టం. ఒళ్ళంతా బాణాలు దిగి అంప శయ్య మీద ఉన్న ఆజన్మ బ్రహ్మ చారి. అష్ట వసువులలో ఒకడు. అతి పుణ్యాత్ముడు అయిన భీష్మ పితామహుడు. ప్రశ్నలు అడుగటానికి వచ్చింది ధర్మరాజు.ఎవరితో? అదే బాణాలు సంధించిన అర్జునుడు ఇతరులతో కలసి . తోడుకొని వచ్చింది "కృష్ణస్తు భగవాన్ స్వయం" అనబడే సాక్షాత్తూ భగవంతుని పూర్ణ అవతారం శ్రీ కృష్ణుడు.

భీష్ముడు ఇచ్చా మరణ వరం కలవాడు. అంటే అనుకున్నపుడే మరణించ గలడు. ఉత్తరాయణ పుణ్య కాలం కోసం ఎదురు చూస్తూ 50 రోజులు వంటిలో దిగిన బాణాలతో అంప శయ్య మీద వేచి వున్నాడు. చివరికి ఈ రోజు పవిత్ర మైన విష్ణు సహస్ర నామములను ఉపదేశించాడు ధర్మరాజుకు. భగవంతుడైన శ్రీ కృష్ణుడు చిరు నవ్వు తో విని ఆమోదించాడు. ఇట్టి మహత్తర ఘట్టం ఎక్కడా లేదు. భగవంతుని దివ్య నామములను స్వయానా భగవంతుడే విని దీవించిన అపూర్వ ఘట్టం.

శ్రుత్వా ధర్మా నషేశేన పావనాని చ సర్వశః యుధిష్టిర స్సాన్తనవం పునరేవాభ్య భాషత --భీష్ముడు చెప్పిన నానా ధర్మాలను విన్న ధర్మరాజు చివరగా. కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.
కిమేకం దైవతం లోకే? కిం వాప్యేకం పారాయణం? స్తువంత కం కమర్చంత ప్రాప్నుయుర్మానవా శుభం? కో ధర్మ సర్వ ధర్మానాం భవత పరమో మతః. కిం జపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్.?
లోకంలో ఎవరు దైవము? ఎవరిని పూజించి, స్తుతించి అర్చించాలి. దేనివల్ల మానవులకు శుభం కలుగుతుంది. అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమేది. దేనిని జపించుట వలన మనిషి సంసార బంధముల నుండి విముక్తి పొందుతాడు? అని.
దానికి భీష్మ పితామహుడు , జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం అని చెబుతూ,
అనాది నిధనం విష్ణుం సర్వ లోక మహేశ్వరం
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వ దుఖాతిగో భవేత్.
ఆది అంతము లేని, సర్వ వ్యాపి అయిన, దేవ దేవుడైన , భగవంతుడైన విష్ణు స్తుతి వల్ల సర్వ దుఃఖములు తోలగుతవి- అని ఇంకా చెబుతూ

ఎషమే సర్వ ధర్మానాం ధర్మోధిక తమో మతః- ఇదియే అన్ని ధర్మములలోకి ఉత్తమ ధర్మమని నా మాట అంటాడు.
నన్ను అనుగ్రహించిన సద్గురువులలో ఒకరైన, మహా తపస్వి, పరమ పూజ్య నందానంద స్వామి ఒక రోజు దీనిని నాకు వివరిస్తూ, సత్యా, పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః- ఏది పరమమైన తెజమో, ఏది పరమ మైన తపమో అట్టి దివ్యము తేజోమయము అయిన మంగళ స్వరూపాన్ని ధ్యానించు అన్నారు.

ముఖ్యం గా విష్ణు సహస్ర నామ జపం, ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని,వ్యాస భగవానుని,పితామహుని,పాండవులను, తల్లి తండ్రులను, గురువులను భక్తీ పూర్వకంగా స్మరించి తదుపరి , ఈ దివ్య నామములను జపిస్తూ తేజో మయుడైన, పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తుల మవుదాం.