గుడిపాటి వెంకట చలం. ఈ పేరు ఒకప్పుడు ఆంద్ర దేశాన్ని కుదిపేసింది. ఎంతోమంది తిట్లకు గురయ్యింది. ఇంకెంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒక మిత్రుడు నిన్ననే చెప్పాడు చలం గారు మీకు దూరపు బంధువే కదా. ఆయన మీద చాలా చర్చలు జరుగుతున్నై బ్లాగుల్లో. ఆయన జాతకం ఒకసారి విశ్లేషణ చెయ్య కూడదూ అని. నేనూ చలం గారి అభిమానినే కాబట్టి చూద్దాం అనుకున్నా. ఆయన పుట్టిన సమయం దొరకలా. అందుకని మనకు తెలిసిన ఇతర విధానాలలో ప్రయత్నం చేద్దాంలే అని చూశాను.చలం గారిని అర్థం చేసుకోటం ఒక రకంగా కష్టం, ఒక రకంగా అతి తేలికా. నేను మొదటగా చలం గారిని గురించి విన్నది 1976 లో అనుకుంటా. అప్పటికే ఆయన రమణాశ్రమ వాసి అయ్యారు. పూనూరులో మా పెద్దమ్మ గారి ఇంట్లో ఉండి పదో తరగతి చదివే రోజుల్లో ఆయన పుస్తకాలు అక్కడి లైబ్రరీలో చదివాను. ఆయనలో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నా, వెంటనే ఆకట్టుకున్నవి కొన్ని.
ఉదార స్వభావం, స్త్రీ సమస్యలపైన ఆయన భావాలు, భావుకత్వం, నిర్మొహమాటంగా మనసులో మాట చెప్పటం, మానవత్వం మొదలైనవి నన్ను ఆయన అభిమానిని చేశాయి. ఆయన స్త్రీల బాధలను గురించి వ్రాసిన విషయాలు, సంఘటనలు మా ఇళ్ళలో నేను మక్కీకి మక్కీగా చూచాను. బహుశ అందుకే ఆయనంటే అభిమానం కలిగిందేమో చెప్పలేను.
ఆయన గురించిన చర్చలు అప్పుడప్పుడు పెద్దల మధ్య జరుగుతూ ఉండేవి. మేము పిల్లలుగా పక్కన నిలబడి వింటుండేవాళ్ళం. అప్పటి నుంచి ఆయన పుస్తకాలు ఎక్కడ దొరికినా చదివేవాన్ని. ఆయన ఇంటర్వ్యూ రేడియోలో వచ్చింది. చాలా నిదానం గా మెల్లిగా మాట్లాడారు. అదే ఆయన ఆఖరి ఇంటర్వ్యూ. తరువాత 1979 లో ఆయన పోయినట్టు రేడియోలో వార్తల్లో చెప్పారు.
1987 లో బళ్లారిలో ఉంకి సన్న రుద్రప్ప లా కాలేజిలో లా చేస్తున్న రోజులు. రోజంతా బళ్ళారి లైబ్రరీలో మకాం. సాయంత్రం కాలేజీ. ఆ లైబ్రరీలో చలం గారి సాహిత్యం మొత్తం ఉండేది. క్లాసుల సంగతి దేవుడెరుగు. రోజంతా విందు భోజనం లా ఉండేది పరిస్థితి. ఆయన మీద అభిమానం పెరిగి పెరిగి ఆయన హాస్పేట లో పని చేసారని చదివాక, ఒకరోజు మిత్రుడు నేను కలిసి హాస్పేట్ వెళ్లి ఆయన నివశించిన ఇంటి కోసం వెతికాం.
ఆయనకు తుంగభద్రలో తారానాధ్ గారు మిత్రుడు. ఇప్పటి మంత్రాలయం రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని అప్పట్లో తుంగభద్ర అనేవారు. ఇప్పటి మంత్రాలయం స్టేషన్ దగ్గిరలో తారానాధ్ గారి బంగాళా చింత తోపుల్లో ఉంది. ఒకరోజు అక్కడకు పోయి వచ్చాం. అప్పుడు తారానాధ్ గారి కూతురు అక్కడ తేనెటీగల పెంపకం చేస్తున్నారు. ఆమె మెడికల్ డాక్టర్. ఆమె చిన్నప్పుడు చలం గారు వారింటికి రావటం ఆమెకు గుర్తుంది. ఆ ఆవరణ అంతా తిరిగి చలం గారు తిరిగిన చోట మనమూ తిరుగుతున్నాం అని ఆనంద పడ్డాం.
తర్వాత ఉద్యోగ రీత్యా విజయ వాడలో 1991 లో ఉన్నపుడు ఒక రోజు దారిన పోతుంటే ఒక మిత్రుడు చూపాడు ఇది రచయిత్రి లత గారి ఇల్లు. ఇందులో కొంత కాలం చలం గారు ఉన్నారు అని. చలం గారికి విజయవాడలో చాలామంది మిత్రులు ఉన్నారుట. ఆ ఇల్లు చూస్తె నాకు చలం గారి మాటలు గుర్తు వచ్చాయి. ఆయన విజయవాడ ఒదిలి శాశ్వతంగా తిరువన్నామలై పోయే రోజున ప్లాట్ఫారం మీద ఆయనకు సెండాఫ్ ఇవ్వటానికి ఒక్కడూ రాలేదుట. ఆ సంగతి ఆయనే రాసుకున్నాడు నిర్వేదంగా.
చలం గారు పెనమలూరు రోడ్డులో అప్పుడు ఉన్న మాల పిచ్చమ్మ గారనే అవదూతను అప్పుడపుడు దర్శించేవాడు. ఆమె దిగంబరి. రోడ్డు పక్కనే దుమ్ములో కూచొని ఉండేది. ఎవర్నీ పట్టించుకునేది కాదు. కాని చలం బస్సు దిగుతూనే ప్రేమగా నవ్వేది. దగ్గిరికి తీసుకుని కొడుకులా ముద్దు చేసేది. ఎప్పుడూ సమాధి స్థితిలో ఉండేది. ఒకరోజు మాల పిచ్చమ్మ గారి ఆలయం దర్శించాను. ఆమె కూచుని ఉండే చోటులోనే కట్టారు. బందరు రోడ్డులో ఉంది. ఆమె చలం గారిని భ్రూ మధ్యం లో తాకి ఏదన్న వెలుగు కనిపించిందా అని చలాన్ని అడిగింది. చలం లేదన్నాడు. ఆమె నిరాశగా, నీకీ జన్మకి ఇంతే రా. నువ్వు కోరుకుంటున్నది వచ్చే జన్మకే అంది. ఈ సంగతి ఆయనే వ్రాసుకున్నాడు.
తరువాత రమణాశ్రమం దర్శించినప్పుడు, రమణ స్తాన్ లో చలం గారున్న ఇల్లు, ఆయన సమాధి చూచాను. మహర్షి పోయిన తరువాత అందరూ ఆశ్రమం ఖాళీ చేసి పొతే, చలం ఒక్కడే మహర్షి సమాధి దగ్గర అలా కూచుని ఉండేవాడు. ఎంత మానసిక సంఘర్షణకి లోనయ్యాడో ఆ రోజుల్లో. అది గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు ధారలు కట్టాయి. ఆశ్రమంలో ఉన్నమూడు రోజులు చలం గారు అనుక్షణం గుర్తోచ్చేవారు. చలం గారిని నేను చూడలేదు. కాని ఆయనకు నాకు తెలియని ఏదో అనుబంధం ఉంది అనిపించింది చాలాసార్లు.
సౌరిస్ గారు భీమిలీలో ఉంటున్నారని తెలిసి వెళ్లి కలుద్దామని ఎన్నో సార్లు అనుకున్నా. ఎందుకో వీలవలేదు. విశాఖ పట్నం వరకు వెళ్లి కూడా ఎందుకో భీమిలీ వెళ్ళలేక పోయే వాణ్ని. కాని మిత్రుడు చంద్ర శేఖర్ ఒకటి రెండు సార్లు వెళ్లి వచ్చాడు. పోయి వద్దాం అనుకుంతుండ గానే సౌరిస్ గారి మరణ వార్త తెలిసింది.
చివరిగా ఒక సంగతి. నా పెళ్ళయిన అయిదేళ్లకు ఒక సారి మా ఇంటిలో మిత్రులతో చర్చలు జరుగుతున్నాయి చలం గారి మీద. మిత్రుడు చరణ్ తండ్రిగారు చెరుకుమిల్లి సత్యనారాయణ గారు , చలం గారు, మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్యా ఉత్తరాలు సాగేవి. సత్యనారాయణ గారు జిల్లెళ్ళమూడి అమ్మగారి బిడ్డ. చలానికి అమ్మగారిని చూడాలని ఆశ. కాని అశక్తుడు, తిరువన్నామలై నుంచి బాపట్ల రాలేడు. ఈ సంగతి సత్యనారాయణ గారు అమ్మగారి చెవిని వేశారు.
అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. విపరీతమైన దగ్గు. అయినా సరే జిల్లెళ్ళమూడి అమ్మగారు చలం కోసమే తన భక్తులు బిడ్డలు అందరితో కలిసి బాపట్ల నుంచి అరుణాచలం వెళ్లి రమణ స్థాన్లో చలాన్ని దగ్గిరికి తీసుకుని ముద్దు చేసి వచ్చింది. అప్పుడు చలం పసి పిల్లాడిలా భోరున ఏడ్చాడు నా కోసం నువ్వే వచ్చావా అమ్మా అంటూ. నేనిక్కడ పడి ఉన్నాను, నా కోసం నువ్వే వచ్చావు. ఏడిరా నీ ఈశ్వరుడు అని ఎవరైనా అడిగితె ఇప్పుడు చూపగలను అంటూ సత్యనారాయణ గారికి వ్రాసిన ఉత్తరం ఇప్పటికీ చరణ్ దగ్గిర భద్రంగా ఉంది.
మా ఆవిడ టీలు ఇస్తూ ఈ సంభాషణ వింటోంది. ఉన్నట్టుండి చల్లగా చెప్పింది చలం గారు మా బంధువే అంటూ. నాకు కళ్లు తిరిగాయి. తరువాత తెలిసింది మా ఆవిడ కజిన్ మధన్నయ్య గారి తల్లిగారు రంగనాయకమ్మ గారి సోదరి అని. ఆరోజు షేర్ మార్కెట్టులో కోటి రూపాయలు ఒకే రోజు లాభం వచ్చినంత ఆనందం కలిగింది.
చలం గారు మొదట్లో జాతకాలు నమ్మే వారు కాదు. అదే చలం గారు చివరిలో భగవత్ గీతకు భాష్యం వ్రాశాడు. వచ్చే వ్యాసంలో చలం గారి జాతకం చూద్దాం.



6 వ్యాఖ్యలు:
Thanks andi.
చాల హృద్యంగా ఉండండి మీ టపా. నా మనసులో మాట మీరు చెప్తున్నట్లు.
చలం గారు ఇలా ఎంతమందితో మానసిక చుట్టరికం ఏర్పరచు కొన్నారో! ఇంకా ముందు రోజుల్లో ఎంతమంది ఆయన ను తనవాడిగా భావించి కళ్ళు తడి చేసుకోవాలో.
మీరన్నట్లు ఆయన మాటలో ఎంత మార్దవం. ముఖం లో ఇంక ప్రశాంతత. రాతల్లోనే పదును. బహుసా మనిషి చాల సున్నితం అనుకొంటా..
అమ్మ , చలం గారి ఫోటో ఇంటర్నెట్ లో ఒక సైట్ లో అమ్మ ఫొటోస్ లో దొరికితే నేను ఎంతో సంతోష పడ్డ.
ఎక్కడ ఎప్పుడు కలిసారో తెలియాలా.. చాల గొప్ప మాట చెప్పారు. అమ్మ ఔన్నత్యన్నికి ఇది మరో నిదర్సనం.
amma ante evarandi..
>>చలం గారు మొదట్లో జాతకాలు నమ్మే వారు కాదు. >>
అప్పటికి అతను రమణ మహర్షి ఆశ్రమంలో చేరలేదు కాబట్టి. రమణాశ్రమంలో చేరకపోతే చలం గారు గొప్ప భౌతికవాదే అయ్యుండేవారనుకుంటాను.
"మిత్రుడు చరణ్ తండ్రిగారు చెరుకుమిల్లి సత్యనారాయణ గారు , చలం గారు, మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్యా ఉత్తరాలు సాగేవి."
ఆ ఉత్తరాలలోని విశేషాలు తెలియచేయగలరు.....
very interesting
మైత్రేయి గారు, మీ హృదయం లోనుంచి వచ్చిన స్పందన నచ్చింది. చలం గారి గురించిన సంచలన మార్మిక నిజాలు కొన్ని వ్రాస్తాను చదవండి. నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం.
ఆనందమే బ్రహ్మప్ప గారు అమ్మ అంటే జిల్లెళ్ళమూడి అమ్మగారు. ఇప్పటివరకు మానవ జాతి చరిత్రలో అవ్యాజ, విశ్వజనీన, ఏ సంకుచిత భావాలూ లేని తల్లి ప్రేమను మాటల్లో చెప్పటం కాకుండా, ఆచరణలో చూపింది ఇద్దరే వ్యక్తులు. ఒకరు శ్రీ రామకృష్ణుని సహ ధర్మ చారిణి శారదా దేవి, ఇంకొకరు జిల్లెళ్ళమూడి అమ్మగా పిలువబడే అనసూయా దేవి. మానవులకే కాదు పురుగులు పశు పక్ష్యాదుల నుంచీ దేవతలవరకూ అందరికీ నేను తల్లినే అన్నవారు వీరిద్దరే. జిల్లెళ్ళమూడి అమ్మ గారిని గురించి ఒక శాతం చెప్పాలన్నా నా శక్తి చాలదు. అనేక పుస్తకాలున్నై చదివి అర్థం చేసుకొని ఆనందించండి.
ISP గారు, చలం ఏ వాదానికీ కట్టుబడడు. అతడు స్వేచ్చా ప్రియుడు. నమ్మకాలతో జీవితాన్ని సరిపుచ్చుకునే వాడే ఏదో ఒక " వాది " అవుతాడు. అన్వేషి అలా ఆగడు. తన గమ్యం చేరేవరకూ వెతుకుతూనే ఉంటాడు. బహుశా ఆ గమ్యం ఎప్పటికీ దొరకదేమో.
సంజీవని, చలం ఉత్తరాలు పుస్తకం గా ఎప్పుడో వచ్చింది. చదవండి.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి